![]() |
![]() |
రియాలిటీ షోలలో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో స్టార్ హీరోలు ఈ షోకు హోస్ట్స్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 నడుస్తోంది. సాధారణంగా బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చెయ్యాలని ఎంతో మంది సెలబ్రిటీలు ఎదురుచూస్తుంటారు. ఛాన్స్ వచ్చిందంటే అది తమ అదృష్టం అనుకుంటారు. కానీ, ఒక హీరోయిన్ మాత్రం బిగ్‌బాస్ అంటే ఛీప్ షో అనే భావనలో ఉంది. 11 ఏళ్లుగా ఆ హీరోయిన్‌ని షోకి రమ్మని ఆహ్వానిస్తున్నా.. ప్రతిసారీ దాన్ని రిజెక్ట్ చేస్తూ వస్తోంది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీదత్తా.
తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది తనుశ్రీ. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ తెలుగులో నటించే అవకాశం రాలేదు. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలు చేసింది. ఆమె చివరగా నటించిన సినిమా 2013లో వచ్చిన ‘సూపర్ కాప్స్ వర్సెస్ సూపర్ విలన్స్’. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. 12 సంవత్సరాలుగా స్క్రీన్‌పై కనిపించని తనుశ్రీ.. ఇటీవల ఓ వీడియోతో బయటికి వచ్చింది. తన ఫ్యామిలీలోని వాళ్లు తనని వేధిస్తున్నారని, ఎవరైనా సాయం చెయ్యండి అంటూ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది తనుశ్రీ.
11 ఏళ్లుగా తనను బిగ్‌బాస్ షోకి రమ్మని ఆఫర్ ఇస్తున్నారని, తను రిజెక్ట్ చేస్తూ వస్తున్నానని చెప్పుకొచ్చింది. రూ.1.65 కోట్లు ఆఫర్ చేసినా షోకి వెళ్ళడానికి తను ఒప్పుకోలేదని అంటోంది. ఆకాశం నుంచి చంద్రుడ్ని తీసుకొచ్చి ఇచ్చినా జీవితంలో బిగ్‌బాస్ షో దరిదాపులకు వెళ్ళనని అంటోంది. బిగ్‌బాస్ షో అంటే ఎందుకంత వ్యతిరేకత అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ‘ఆ షోలో లేడీస్, జెంట్స్ ఒకే బెడ్‌పై పడుకుంటారు. ఆ తర్వాత అదే ప్లేస్ దెబ్బలాడుకుంటారు. అలాంటి షో కోసం ఒక అబ్బాయి పక్కన పడుకునే అమ్మాయి గురించి అందరూ ఏమనుకుంటారు? నేను అలాంటి చీప్ మనిషిని కాదు. నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ షోకి వెళ్ళను. నా కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉంటాను’ అని స్పష్టం చేశారు తనుశ్రీ దత్తా.
![]() |
![]() |